పరిచయం

లీలావతీ - ఒక ప్రాకృత కావ్యం

 ‘లీలావతి’ అనే పేరు వినగానే చాలామందికి భాస్కరాచార్యుని గణితగ్రంథమే గుర్తుకు వస్తుంది. కానీ దానికంటే కొన్ని శతాబ్దాల ముందే, అదే పేరుతో ఒక అందమైన ప్రాకృతకావ్యం వెలువడింది. అదే కుతూహల/కౌహలుని లీలావతీ.  ప్రాకృతంలో లీలావఈ.

కవి, కాలం, భాష

ఈ కవి పేరు విషయంలోనే ఒక సందేహం ఉంది. ఈ కావ్యానికి సంస్కృతవృత్తి వ్రాసిన ప్రాచీనవ్యాఖ్యాత కావ్యంలో కనిపించే కోఊహలేణ అనే పదాన్ని కవి పేరుగా గ్రహించి కుతూహలేన అని వ్యాఖ్యానించారు. అయితే ఆ పదానికి ‘కుతూహలంతో’ అనే మామూలు అర్థం కూడా రావచ్చు. కవి తన పేరును కావ్యంలో స్పష్టంగా చెప్పలేదు. అయినా సంస్కృతవ్యాఖ్యాత చాలాచోట్ల అతని కుతూహలకవిగా పేర్కొన్నారు. ఈ కావ్యానికి ఆధునిక కాలంలో పరిశోధకప్రతిని తయారుచేసిన  ఎ. ఎన్. ఉపాధ్యే (ఉపాధ్యాయ)కూడా ప్రస్తుతమున్న ఆధారాల మేరకు ఆ పేరునే స్వీకరించారు. 

కవి తన గురించి ఎక్కువగా చెప్పుకోలేదు కాని తన వంశాన్ని మాత్రం పరిచయం చేశాడు. అతని తాత బహులాదిత్యుడు, తండ్రి భూషణభట్టు - వేదవిద్యలో ప్రసిద్ధులైన బ్రాహ్మణులు. మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, కవి ఈ కథను తన ప్రియురాలి కోరికపై చెప్పాడని కావ్యంలోనే అంటాడు. సంస్కృతవ్యాఖ్యాత ఆమెను కవి భార్యగా భావించి, ఆమె పేరు సావిత్రి అని కూడా పేర్కొన్నాడు. స్త్రీలకు నచ్చేలా ఒక కథ చెప్పమని ఆమె కోరడం, కవి ఆ కోరికకు సమాధానంగా ఒక సుదీర్ఘమైన ప్రేమకథను చెప్పడం - మొత్తం కావ్యానికి ఒక ఆత్మీయమైన నేపథ్యాన్ని ఇస్తుంది.

లీలావతీ ఎప్పుడు రచించబడిందో కవి చెప్పలేదు. గ్రంథంలోని సూచనలు - రాష్ట్రకూట - చాళుక్య సైన్యాల ప్రస్తావన, భాషాస్వరూపం, తరువాతి ఆలంకారికులు ఈ కావ్యంనుండి చూపిన ఉదాహరణలు, మొదలైన ఆధారాలను పరిశీలించిన ఉపాధ్యాయ, దీని రచనాకాలాన్ని సుమారు క్రీ.శ. 800 ప్రాంతంగా నిర్ణయించారు. ఇంకా ఇటీవలి పరిశోధకులు కూడా దీనిని 8వ శతాబ్దం చివర, లేదా 9వ శతాబ్దం ప్రారంభానికి చెందిన రచనగా భావిస్తున్నారు.

ఈ కావ్యం మహారాష్ట్రీ ప్రాకృతంలో రచించబడింది. ప్రాచీన భారతదేశంలో కవిత్వానికి, ముఖ్యంగా ప్రేమకవిత్వానికి విస్తృతంగా ఉపయోగించిన ఒకరకమైన ప్రాకృతం. కవి స్వయంగా తన భాషను మరహట్ఠదేశీ భాష అని పేర్కొంటాడు.

లభించిన ప్రతులన్నిటిలోని గాథలను కలిపి చూస్తే, ఈ కావ్యంలో సుమారు 1350 గాథలు ఉన్నాయి. మధ్యమధ్యలో కొద్దిపాటి గద్యలు, ఇతర ఛందస్సులలో కొన్ని పద్యాలు కనిపించినా, కావ్యం ప్రధానంగా గాథాఛందస్సులోనే సాగుతుంది. సర్గలు, ఆశ్వాసాలు, పరిచ్ఛేదాలు వంటి విభాగాలు లేకుండా కథ అంతా ఒకే ప్రవాహంగా నడుస్తుంది.

కవి దీనిని దివ్యమానుషీ కథ అని పిలిచాడు - అంటే మానవులతోపాటు విద్యాధరులు, యక్షులు, గంధర్వులు, సిద్ధులు, రాక్షసులు కూడా పాత్రలుగా కనిపించే కథ. శివుడు, పార్వతి, భీమేశ్వరక్షేత్రం, పాశుపతసాధువులు మొదలైనవారి ప్రాధాన్యం వల్ల దీనికి స్పష్టమైన శైవసాంస్కృతిక నేపథ్యం ఉంది.

కథ ఏమిటి?

కథకు నాయకుడు శాతవాహనచక్రవర్తి హాలుడు, నాయిక సింహళరాజకుమారి లీలావతి. వారిద్దరి మధ్యన ప్రేమ, వివాహమూ కావ్యంలోని ప్రధానవస్తువు. అయితే అది కేవలం శృంగారకావ్యం కాదు, ప్రేమకథ కాదు. వారి వివాహం చుట్టూ మరెన్నో జీవితాలు, మరెన్నో ప్రేమకథలు అల్లుకుంటాయి. మహానుమతి - మాధవానిలుడు, కువలయావళి- చిత్రాంగదుడు వంటి జంటల వియోగాలు, శాపాలు, పాతాళయాత్రలు, యుద్ధాలు, అనుకోని కలయికలు ప్రధానకథలో కలిసిపోతాయి. ఒక పాత్ర తన కథను చెబుతుంది; ఆ కథలో మరో పాత్ర తన గతాన్ని వివరిస్తుంది; అలా కథలో కథ, దానిలో మరొక కథ తెరుచుకుంటూ పోతుంది. ఈ కథనపద్ధతి కొన్ని సందర్భాలలో బాణుని కాదంబరిని గుర్తుచేస్తుంది.

ప్రకృతివర్ణనలు, ఋతువుల చిత్రణ, ప్రేమికుల విరహం, నగరజీవితం, వేటలు, యుద్ధాలు, ప్రయాణాలు, సముద్రపు తుపానులు - కవి వీటన్నిటినీ ఎంతో కల్పనాశక్తితో వర్ణించాడు. కాళిదాసు, సుబంధు, బాణుడు, హర్షుడు మొదలైన పూర్వకవుల రచనలతో అతనికి పరిచయం ఉన్నట్లు అనిపించినా, అతని ఉపమలలోనూ దృశ్యకల్పనలోనూ తనదైన క్రొత్తదనం కనిపిస్తుంది.

తెలుగు నేలతో సంబంధం

నేనీ కావ్యాన్ని తెలుగులోకి తీసుకురావాలని అనుకోవడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది - తెలుగు నేలతో లీలావతీకి కనిపించే సన్నిహిత సంబంధం. కవి తెలుగువాడని గానీ, ఈ కావ్యం తెలుగుదేశంలోనే రచించబడిందని గానీ నిర్ధారణగా చెప్పడానికి ఆధారాలు లేవు. అయినా కథలోని భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక ప్రపంచం తెలుగు పాఠకులకు పరిచయమైనదే.

కథానాయకుడైన హాలుడు శాతవాహనవంశానికి చెందిన రాజు. అతని రాజధాని గోదావరీ తీరంలోని ప్రతిష్ఠానం - నేటి మహారాష్ట్రలోని పైఠణ్. పురాణాలు శాతవాహనవంశాన్ని ‘ఆంధ్ర’ వంశంగా పేర్కొంటాయి. వారి రాజకీయపరిధి దక్కనుప్రాంతమంతటా వ్యాపించింది. అందువల్ల శాతవాహనచరిత్రకు ఆంధ్రదేశంతో ఉన్న సంబంధం విస్మరించలేనిది.

అంతకంటే ముఖ్యంగా, కావ్యంలోని ప్రధాన సంఘటనలు సప్తగోదావరీ భీమం అనే ప్రదేశంలో జరుగుతాయి. గోదావరి ఏడుపాయలుగా విడిపోయి సముద్రంలో కలిసే ప్రాంతంలోని భీమేశ్వరక్షేత్రంగా సంస్కృతవ్యాఖ్యాత దీనిని వివరిస్తారు. కథలో గోదావరీ నదీముఖం, సప్తగోదావరి, భీమేశ్వరాలయం, పాశుపతసాధువు - అన్నీ స్పష్టంగా కనిపిస్తాయి.

ఈ వివరాల ఆధారంగా ఉపాధ్యాయ, సప్తగోదావరీభీమాన్ని నేటి కోనసీమ సమీపంలోని ద్రాక్షారామ భీమేశ్వరక్షేత్రంగా గుర్తించే అవకాశం ఉందన్నారు. ఇదే క్షేత్రం, ఇదే సప్తగోదావరీ ప్రాంతం శ్రీనాథుని భీమఖండంలో తెలుగు సాహిత్యానికి సుపరిచితమైన పవిత్రభూమిగా అవతరించింది.

లీలావతీకి మరొక ఆసక్తికరమైన తెలుగు సంబంధం ఉంది. ఉపాధ్యాయ విమర్శాత్మక సంచిక వెలువడకముందే, శ్రీ మానవల్లి రామకృష్ణకవిగారు 1926 ఫిబ్రవరి భారతి సంచికలో ఈ కావ్యాన్ని గురించి వ్రాసి, అందులోని పద్దెనిమిది గాథలను ఉదాహరించారు. ఆయన ఉపయోగించిన వ్రాతప్రతి ఇప్పుడు ఎక్కడ ఉందో తెలియదు.

అందువల్ల లీలావతీ మహారాష్ట్రీ ప్రాకృతంలో రచించబడిన కావ్యమే అయినా, అది సంచరించే నేలలో గోదావరి ప్రవహిస్తుంది; దాని ప్రధానఘట్టాలు సప్తగోదావరీ భీమేశ్వరుని సన్నిధిలో జరుగుతాయి; దాని నాయకుడు ఆంధ్రులతో ముడిపడిన శాతవాహనుడు. ఈ విశిష్టతలు లీలావతీని తెలుగు పాఠకులకు పరిచయం చేయాలనే నా ప్రయత్నానికి ఒక ప్రధాన ప్రేరణ.

కావ్యం మనకు ఎలా చేరింది?

లీలావతీ చాలాకాలం తాళపత్రాలలో, కాగితపువ్రాతప్రతులలోనే ఉండిపోయింది. పాటణ్, జైసల్మేర్, బీకానేర్‌లలో లభించిన ప్రతులను సేకరించి, వాటి పాఠభేదాలను పోల్చి, ప్రాకృతపండితులు డా. ఎ. ఎన్. ఉపాధ్యాయగారు దీనికి మొట్టమొదటి విమర్శాత్మక ప్రతిని సిద్ధం చేశారు. అది సింఘీ జైన గ్రంథమాలలో 1949లో వెలువడింది. స్వల్ప సవరణలు, వివరణాత్మక చేర్పులతో కూడిన రెండవ ముద్రణ 1966లో వచ్చింది.

ఉపాధ్యాయ కేవలం ప్రాకృతపాఠాన్ని ముద్రించడమే చేయలేదు. వివిధ వ్రాతప్రతుల పాఠాలను పోల్చి విమర్శాత్మక పాఠాన్ని నిర్ణయించారు; పాఠాంతరాలను నమోదు చేశారు; కవి, కాలం, కథాస్వరూపం, హాలుడు, సప్తగోదావరీ భీమం, భాష మొదలైన అంశాలపై విస్తృతమైన పరిశోధనాత్మక పరిచయాన్ని వ్రాసారు. క్లిష్టమైన గాథలకు వ్యాఖ్యలు ఇచ్చి, కావ్యంలోని పదాలన్నింటినీ సమీకరించిన విస్తృత పదకోశాన్ని కూడా చేర్చారు. లీలావతీని ఆధునిక పాఠకలోకానికి తిరిగి అందించిన ఘనత ఆయనదే.

ఈ కావ్యంతోపాటు ఒక అజ్ఞాత జైన వ్యాఖ్యాత రచించిన సంస్కృత వృత్తి కూడా లభించింది. దానిని రచించిన వ్యాఖ్యాత పేరు, కాలం స్పష్టంగా తెలియవు. ప్రస్తుతం లభిస్తున్న వృత్తి అన్ని చోట్లా సంపూర్ణంగా లేదు; అయినప్పటికీ క్లిష్టమైన ప్రాకృతపదాలను, వాక్యాన్వయాన్ని, పాత్రల పేర్లను, కథాసందర్భాలను అర్థం చేసుకోవడానికి అది చాలా విలువైన ఆధారం.

ఇటీవల ఆండ్రూ ఆలెట్ ఈ కావ్యానికి ఆంగ్లానువాదం చేసారు. ప్రాకృతమూలాన్ని ఆధునిక పాఠకుడికి చేరువచేయడమే కాక, కథాసందర్భాలను, పదప్రయోగాలను అర్థం చేసుకోవడానికి ఆ అనువాదం ఎంతో ఉపయోగకరమైన ఆధారం. 

ఈ తెలుగు అనువాదం

లీలావతీని గాథ గాథగా తెలుగులో వచనానువాదం అందించాలన్నది ఈ ప్రయత్నం. ప్రతి గాథను—

  • ప్రాకృత మూలం

  • సంస్కృత ఛాయ

  • తెలుగు వచనానువాదం 

  • అవసరమైన చోట వ్యాఖ్య

అనే క్రమంలో అందిస్తాను. పాత్రల పేర్లకు తెలుగులో సంస్కృతరూపాలను ఉపయోగించి, మొదటిసారి వచ్చినప్పుడు మాత్రం ప్రాకృతరూపాన్ని కూడా ఇస్తాను.

దాదాపు పన్నెండు శతాబ్దాల క్రితం ప్రాకృతంలో చెప్పబడిన ఈ కథ నేటి పాఠకుడికి పూర్తిగా అపరిచితమైన లోకం కాదు. ప్రేమలో తొందరపడే యువత, కుటుంబమర్యాదలు, వియోగంలో తీసుకునే తీవ్రమైన నిర్ణయాలు, స్నేహితుల సహాయం, అక్కచెల్లెళ్ల అనుబంధం, విధి కల్పించే అడ్డంకులు, వాటిని అధిగమించడానికి చేసే ప్రయత్నాలు - ఇవన్నీ ఇప్పటికీ మనకు తెలిసినవే.

సార్వకాలికమైన ఈ మానవానుభవాలను, వేలయేండ్ల క్రిందట గోదావరీతీరంలో విస్తరించిన ఒక అపరిచితమైన ప్రాకృతకవితాలోకంలోకి తీసుకువెళ్లి తెలుగువాళ్లకు పరిచయం చేయడమే ఈ ప్రయత్నం.



Comments