కవి పరిచయం - కథ ప్రస్తావన

18.

ఆసి తివేఅతిహోమగ్గిసంగసంజణిఅతిఅసపరిఓసో । 

సంపత్తతివగ్గఫలో బహులాఇచ్చో తి ణామేణ ॥


ఆసీత్ త్రివేదత్రిహోమాగ్నిసంగసంజనితత్రిదశపరితోషః । 

సంప్రాప్తత్రివర్గఫలో బహులాదిత్య ఇతి నామ్నా ॥ 


మూడు వేదాలను అధ్యయనం చేసి, మూడు హోమాగ్నులతో దేవతలను సంతోషపెట్టి, ధర్మార్థకామాలనే త్రివర్గఫలాలను పొందిన బహులాదిత్యుడు (బహులాఇచ్చ) అనే బ్రాహ్మణుడు ఉండేవాడు.

సజ్జన-దుర్జన విచారణ

12.

జఅంతి తే సజ్జణభాణుణో సఆ విఆరిణో జాణ సువణ్ణసంచఆ ।

అఇట్ఠదోసా విఅసంతి సంగమే కహాణుబంధా కమలాఅరా ఇవ ॥ 


జయంతి తే సజ్జనభానవః సదా విచారిణః యేషాం సువర్ణసంచయా ।

అదృష్టదోషాః వికసంతి సంగమే కథానుబంధాః కమలాకరా ఇవ ॥ 


సజ్జనులనే సూర్యులకు జయమగు గాక అంటున్నాడు కవి. వారు సదా విచారులు. విచారిన్ శబ్దానికి సజ్జనుని పరంగా ఆలోచనాపరుడు అని, సూర్యునిపరంగా వియత్తునందు అంటే ఆకాశంలో చరించేవాడు అని అర్థం.


ఆ సజ్జనసూర్యుల సాంగత్యంవలన కథాకావ్యాలనే పద్మసరస్సులు వికసిస్తాయి. ఆ సరస్సులు ఎలాంటివి అంటే - సువర్ణసంచయములు, అదృష్టదోషములు. 


సువర్ణసంచయములు - సరస్సుపరంగా మంచి రంగుగల పద్మాలసమూహం కలవి. కావ్యపరంగా మంచి అక్షరాల సమూహం కలవి. 


అదృష్టదోషములు - సరస్సుపరంగా రాత్రి (దోష) కనిపించనివి. సూర్యోదయంతో రాత్రి తొలగి పద్మాలతో విలసిల్లుతున్నవి అని. కావ్యపరంగా దోషాలు లేనివి అని.


ఇది వంశస్థవృత్తంలో ఉన్న శ్లోకం. శ్లేషచమత్కారంతో రూపకాలంకారం సమర్థించబడింది.

ఇష్టదేవతాస్తుతి

(ఈ ఇష్టదేవతాస్తుతికి తెలుగుపద్యానువాదం చేయాలనే కోరికతో చేసిన నా అనువాదాలు కూడా క్రింద అందిస్తున్నాను)

1.
ణమహ సరోససుఅరిసణసచ్చవిఅం కరరుహావలీజుఅలం ।
హిరణక్కసవిఅడోరత్థలట్ఠిదలగబ్భిణం హరిణో ॥


నమత సరోషసుదర్శనదృష్టం కరరుహావలీయుగలమ్ ।
హిరణ్యకశిపువికటోరఃస్థలాస్థిదలగర్భితం హరేః ॥ 


నృసింహుని గోళ్లవైపు సుదర్శనచక్రం కినుకతో చూస్తోందట. ఆ గోళ్ల సందుల్లో హిరణ్యకశిపుని భయంకరమైన రొమ్ముటెముకల ముక్కలు ఇరుక్కొని ఉన్నాయి. అలాంటి ఆ రెండుచేతుల గోళ్లవరుసలకు నమస్కరించండి అని కవి ప్రార్థన.

సాధారణంగా రాక్షససంహారానికి హరి ఉపయోగించేది సుదర్శనచక్రం. కానీ ఈ నృహరి హిరణ్యకశిపుని సంహరించేందుకు తనను కాదని చేతిగోళ్లను ప్రయోగించడంతో వాటిపై చక్రానికి ఈర్ష్య!


కం.
సిరిమగని చుట్టుకైదువు 
కొరకొరఁ గనఁ గనకకశిపు ఘోరోరశ్శ
ల్యరజోరక్తరుచి మెఱయు
నరహరిశ్రీకరకరఖరనఖములకు నతుల్