సజ్జన-దుర్జన విచారణ
12.
జఅంతి తే సజ్జణభాణుణో సఆ విఆరిణో జాణ సువణ్ణసంచఆ ।
అఇట్ఠదోసా విఅసంతి సంగమే కహాణుబంధా కమలాఅరా ఇవ ॥
జయంతి తే సజ్జనభానవః సదా విచారిణః యేషాం సువర్ణసంచయా ।
అదృష్టదోషాః వికసంతి సంగమే కథానుబంధాః కమలాకరా ఇవ ॥
సజ్జనులనే సూర్యులకు జయమగు గాక అంటున్నాడు కవి. వారు సదా విచారులు. విచారిన్ శబ్దానికి సజ్జనుని పరంగా ఆలోచనాపరుడు అని, సూర్యునిపరంగా వియత్తునందు అంటే ఆకాశంలో చరించేవాడు అని అర్థం.
ఆ సజ్జనసూర్యుల సాంగత్యంవలన కథాకావ్యాలనే పద్మసరస్సులు వికసిస్తాయి. ఆ సరస్సులు ఎలాంటివి అంటే - సువర్ణసంచయములు, అదృష్టదోషములు.
సువర్ణసంచయములు - సరస్సుపరంగా మంచి రంగుగల పద్మాలసమూహం కలవి. కావ్యపరంగా మంచి అక్షరాల సమూహం కలవి.
అదృష్టదోషములు - సరస్సుపరంగా రాత్రి (దోష) కనిపించనివి. సూర్యోదయంతో రాత్రి తొలగి పద్మాలతో విలసిల్లుతున్నవి అని. కావ్యపరంగా దోషాలు లేనివి అని.
ఇది వంశస్థవృత్తంలో ఉన్న శ్లోకం. శ్లేషచమత్కారంతో రూపకాలంకారం సమర్థించబడింది.
13.
సో జఅఉ జేణ సుఅణా వి దుజ్జణా ఇహ విణిమ్మిఆ భువణే ।
ణ తమేణ విణా పావంతి చందకిరణా వి పరిహావం ॥
స జయతు యేన సుజనా ఇవ దుర్జనా ఇహ వినిర్మితా భువనే ।
న తమసా వినా ప్రాప్నువంతి చంద్రకిరణా అపి పరభాగమ్ ॥
ఈ లోకంలో సజ్జనులలాగే దుర్జనులను కూడా సృష్టించిన ఆ సృష్టికర్తకు జయమగు గాక! చీకటి లేకపోతే చంద్రకిరణాలు కూడా తమ విశేషమైన శోభను పొందవు కదా!
14.
దుజ్జణసుఅణాణ ణమో ణిచ్చం పరకజ్జవావడమణాణ ।
ఎక్కే భసణసహావా పరదోసపరమ్ముహా అణ్ణే ॥
దుర్జనసుజనేభ్యో నమో నిత్యం పరకార్యవ్యాపృతమనోభ్యః ।
ఏకే భణనస్వభావాః పరదోషపరాఙ్ముఖా అన్యే ॥
ఎల్లప్పుడూ ఇతరుల పనులలోనే తమ మనసు పెట్టే దుర్జనులకూ, సుజనులకూ కూడా ఒక నమస్కారం! వారిలో ఒకరు (దుర్జనులు) - ఇతరులగూర్చి అసంబద్ధంగా మాట్లాడడమే స్వభావంగా కలవారు. మరొకరు (సుజనులు) - పరులదోషాలవైపు ముఖం తిప్పనివారు.
ఇద్దరి దృష్టీ పరుల మీదనే ఉన్నా - ఒకరు పరాపకారులూ, మరొకరు పరోపకారులు అని.
15.
అహవా ణ కో వి దోసో దీసఇ సఅలమ్మి జీవలోఅమ్మి ।
సవ్వో చ్చిఅ సుఅణయణో జం భణిమో తం ణిసామేహ ॥
అథవా న కోఽపి దోషో దృశ్యతే సకలేఽపి జీవలోకే ।
సర్వ ఏవ సుజనజనో యద్భణామస్తన్నిశామయత ॥
లేదా, "అసలు ఈ లోకంలో దోషమన్నదే కనిపించదు, అందరూ సుజనులే" అంటే, చెప్తాను వినండి - అంటున్నాడు కవి.
ఈ గాథకు సంస్కృత వృత్తిలో మరొక రకమైన వివరణ ఉంది - దుర్జనులను చూసి, అలా ఉండకూడదని, సజ్జనులు కొంచెమైనా తప్పు చేయకుండా ఉంటారు. అలా సజ్జనులను సన్మార్గంలో ఉంచడానికి కారణం అవుతున్న దుర్జనులను కూడా ఒక విధంగా ‘సుజనులే’ అనుకోవచ్చు.
అయితే తర్వాత గాథలలో చెపుతున్నదానికి దీనితో పొసగడం లేదు. లోకంలో అందరూ సుజనులే అన్నమాటను తర్వాత గాథలు వ్యతిరేకిస్తున్నాయి. అంచేత లోకంలో దోషం లేదు, అందరూ సుజనులే అనడం సరికాదన్నదే ఇక్కడ కవిహృదయం అనిపిస్తోంది. ఆంగ్ల అనువాదం అదే అర్థంలో ఉంది.
16.
సజ్జణసంగేణ వి దుజ్జణస్స ణ హు కలుసిమా సమోసరఇ ।
ససిమండలమజ్ఝపరిఠ్ఠిఓ వి కసణో చ్చిఅ కురంగో ॥
సజ్జనసంగేనాపి దుర్జనస్య న ఖలు కలుషత్వం సమపసరతి ।
శశిమండలమధ్యస్థితోఽపి కృష్ణ ఏవ కురంగః ॥
సజ్జనసాంగత్యంలో కూడా దుర్జనుని మాలిన్యం తొలగిపోదు. చంద్రబింబం మధ్యలో ఉన్నప్పటికీ అందులోని లేడి నల్లగానే ఉంటుంది.
ఒక తమాషా సంగతి: ఇది కాళిదాసు కుమారసంభవంలో చెప్పిన దానికి సరిగ్గా వ్యతిరేకభావం!
ఏకో హి దోషో గుణసన్నిపాతే
నిమజ్జతీందోః కిరణేష్వివాంకః - కు.సం. 1.3
"గుణసమూహంలో ఉండే ఒక్క దోషం, చంద్రకిరణాలలో మచ్చలాగా మరుగున పడిపోతుంది."
16.1
దుజ్జణసంగేణ వి సజ్జణస్స ణాసం ణ హోఇ సీలస్స ।
తీఏ సలోణేఽవి ముహే తహ వి హు అహరో మహుం సవఇ ॥
దుర్జనసంగేనాపి సజ్జనస్య నాశో న భవతి శీలస్య ।
స్త్రియాః సలవణేఽపి ముఖే, తథాపి ఖల్వధరో మధు స్రవతి ॥
దుర్జనసాంగత్యంలో కూడా సజ్జనుని శీలం నశించదు. స్త్రీ ముఖం లావణ్యవంతమైనదే అయినా - అందులోని పెదవి మాత్రం తేనెనే స్రవిస్తుంది.
"సలవణో" అంటే "లావణ్యవంతము" అన్న పదంలో శ్లేషని ఉపయోగించి చేసిన చమత్కారం. లావణ్యం అంటే అందం, ఉప్పదనం. ఇందులో ఉన్నది ఒక విరోధాభాస. అంతే తప్ప నిజానికి దుర్జనసాంగత్యంలో కూడా సజ్జనుని శీలం నశించదు అన్నదానికి ఇది సరైన దృష్టాంతం అని చెప్పలేం.
17.
అలమవరేణాసంబంధాలావపరిగ్గహాణు బంధేణ ।
బాలజణవిలసిఏణ వ ణిరత్థ్వాఆపసంగేణ ॥
అల మపరేణాసంబద్ధాలాపపరిగ్రహానువర్ధేన ।
బాలజనవిలసితేనైవ నిరర్థకం వాక్ప్రసంగేన ॥
ఈ సజ్జనదుర్జన ప్రసంగంతో కవిగారికి విసుకుపుట్టింది!
"ఇక ఈ విషయంలో అసంబద్ధ ప్రలాపాలు సాగదీయడం చాలు. పిల్లల పలవరింతల్లాంటి ఈ వ్యర్థప్రసంగం విస్తారం ఇంకా ఎందుకు?" - అని ముందుకు సాగుతున్నాడు.
Comments
Post a Comment